కంచ గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రుల కమిటీ చురుకుగా చర్యలు…

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, వివాద పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా హెచ్‌సీయూ పరిధిలో కొనసాగుతున్న భూ అభివృద్ధి కార్యక్రమాలపై వివాదం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అటవీశాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరుగనుంది. మంత్రుల కమిటీలో భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌరసంఘాలు, పర్యావరణ నిపుణులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

ఈ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సీఎస్‌కు వ్యక్తిగతంగా బాధ్యత ఉందని హెచ్చరించింది. భూమి అటవీశాఖ పరిధిలో ఉందా? లేదా? అనే అంశం కీలకంగా మారింది. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా? అనే అంశాలపై హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పలు ప్రాథమిక అంశాల ఆధారంగా అక్కడ అడవిజంతువులు నివసించగల ప్రాంతంగా ఉన్నదని అర్థమవుతోంది.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఏప్రిల్ 16లోపు సీఎస్ నుంచి సమగ్ర నివేదిక కోరింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు కంచ గచ్చిబౌలిలో ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా కమిటీని ఏర్పాటు చేయకపోతే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ పరిణామాలతో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ తీరు, కోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ అంశాల సమన్వయంలో ఈ వివాదం పరిష్కారానికి దారితీసేలా అధికారులు శ్రమిస్తున్నారు.

Read More : రైలులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు