బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణ, వరంగల్‌లో జరగనున్న మహాసభ కోసం జన సమీకరణ, సభ ఏర్పాట్లపై వివరణాత్మకంగా చర్చించారని సమాచారం.

కేసీఆర్, మహాసభ విజయవంతంగా నిర్వహించేందుకు నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజాసంబంధ అంశాలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజల్లో చైతన్యం కలిగించేలా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్య ప్రస్తావించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల వివాదం, హెచ్‌సీయూ భూముల అంశం, ఎమ్మెల్యేల అనర్హతపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై నేతలు కేసీఆర్‌కు వివరించారని, పార్టీ వేదికగా తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More : కంచ గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రుల కమిటీ చురుకుగా చర్యలు…
