ఇజ్రాయెల్, ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై గుప్త నిఘా

ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ సుదీర్ఘకాలంగా రహస్యంగా నిఘా పెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సంచలన ప్రకటన చేసింది. డజన్లకొద్ది ఇంటెలిజెన్స్ పరిశోధకులు పాల్గొన్న అత్యంత రహస్య ఆపరేషన్‌లో భాగంగా, ఇరాన్‌కు చెందిన తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చినట్లు శనివారం వెల్లడించింది.

ఈ ఆపరేషన్‌తో ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్రమైన దెబ్బ తగిలిందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. హతమైన శాస్త్రవేత్తలు ఇరాన్ అణుబాంబు తయారీ ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారని పేర్కొంది. “వీరిలో అందరూ అణ్వాయుధ అభివృద్ధిలో అపారమైన అనుభవం కలిగి ఉన్న నిపుణులు” అని తెలిపింది.

మరణించిన వారిలో అణు ఇంజనీరింగ్ నిపుణుడు ఫెరీడూన్ అబ్బాసీ, భౌతిక శాస్త్రవేత్త మొహమ్మద్ మెహదీ తెహ్రాంచీ, రసాయన ఇంజనీరింగ్ నిపుణుడు అక్బర్ మొతలేబి జాదే, మెటీరియల్స్ ఇంజనీరింగ్ నిపుణుడు సయీద్ బర్జీ, భౌతిక శాస్త్రవేత్త అమీర్ హసన్ ఫఖాహీ, రియాక్టర్ ఫిజిక్స్ నిపుణుడు అబ్ద్ అల్-హమీద్ మినౌషెహ్ర్, భౌతిక శాస్త్రవేత్త మన్సూర్ అస్గరీ, అణు ఇంజనీర్ అహ్మద్ రెజా జోల్ఫాఘరీ దర్యాణీ, మెకానికల్ నిపుణుడు అలీ బఖౌయీ కతిరిమీ ఉన్నారు. వీరిలో చాలామంది 2020లో హత్యకు గురైన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొహ్సెన్ ఫక్రిజాదే వారసులు అని ఐడీఎఫ్ పేర్కొంది.

శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో ఈ శాస్త్రవేత్తలతో పాటు ఆరుగురు ఉన్నత స్థాయి అధికారులు, పలువురు సీనియర్ సైనికాధికారులు కూడా మరణించినట్లు పేర్కొంది.

“గత ఏడాది కాలంగా వర్గీకరించిన, లోతైన ఇంటెలిజెన్స్ పరిశోధనల ద్వారా ఈ ఆపరేషన్‌కు పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. అనేక ఇంటెలిజెన్స్ నిపుణులు సంవత్సరాలుగా ఈ గోప్యమైన మిషన్‌పై పని చేశారు” అని ఐడీఎఫ్ వివరించింది.

ఈ చర్యలతో ఇరాన్ అణు అభివృద్ధి యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More : ఇజ్రాయెల్ రక్షణ దళాల మ్యాప్ వివాదం..

One thought on “ఇజ్రాయెల్, ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై గుప్త నిఘా

Comments are closed.