గోదావరి జలాల తరలింపుపై ఆందోళన వ్యక్తం చేసిన హరీశ్ రావు.

Harish Rao

తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాల తరలింపుపై తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం వద్ద ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు తరలించినట్లే, ఇప్పుడు గోదావరి జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును వేగంగా నిర్మిస్తోందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీశ్ రావు ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణ పనుల్లో వేగంగా ముందుకు సాగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండడం బాధాకరమన్నారు. జూన్ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవనుందని చెప్పారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం మాటలకే పరిమితమవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమైపోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తోందని ఆరోపించారు. రెండు బడ్జెట్లలో తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించలేదని తెలిపారు.

తెలంగాణకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా స్పందించకపోవడాన్ని హరీశ్ రావు గట్టిగా తప్పుబట్టారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2 టీఎంసీల నీటి కోసం చంద్రబాబు పోరాడినట్టు ఇప్పుడు 200 టీఎంసీల నీటిని ఏపీ తరలించబోతే మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించిన హరీశ్ రావు, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుందన్నారు.

Read More : ఈ-ఫార్ములా కేసులో చామల కౌంటర్