ఉక్రెయిన్ యుద్ధానికి పూర్తి మద్దతుతో ఉత్తర కొరియా

ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధానికి రష్యా చేసిన చర్యలు పూర్తిగా సమర్థనీయం అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన మద్దతు ప్రకటించారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ప్యాంగ్యాంగ్‌లో కిమ్‌ను కలిసిన సందర్భంగా, రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీ జరిగింది.

ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ, “ఉక్రెయిన్ యుద్ధం సహా అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా తీసుకుంటున్న వైఖరికి, విదేశాంగ విధానాలకు ఉత్తర కొరియా బేషరతుగా మద్దతుగా నిలుస్తుంది” అని స్పష్టంగా ప్రకటించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై, అలాగే కుర్స్క్ ప్రాంత పునర్నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఇదే సంవత్సరం మార్చిలో కూడా షోయిగు ఉత్తర కొరియాకు వచ్చి కిమ్‌తో భేటీ అయ్యారు. అప్పట్లోనూ ఉత్తర కొరియా, రష్యా సార్వభౌమాధికారానికి పూర్తి మద్దతునిస్తున్నదని కిమ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇంతకుముందు ఏప్రిల్ నెలలో ఉత్తర కొరియా తమ సైనిక బలగాలు రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నాయన్న విషయాన్ని ధృవీకరించింది. రష్యా కూడా దీనిపై స్పందిస్తూ, పరస్పర రక్షణ ఒప్పందం కింద ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అయితే, ఈ యుద్ధానికి ఎంతమంది ఉత్తర కొరియా సైనికులు వెళ్ళారన్న వివరాలను ఇరు దేశాలు అధికారికంగా వెల్లడించలేదు. ఉక్రెయిన్ గూఢచర్య వర్గాలు, దక్షిణ కొరియా అధికారులు అంచనా వేసిన ప్రకారం, ఈ సంఖ్య సుమారు 10,000 నుండి 12,000 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. రష్యా – ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న సైనిక భాగస్వామ్యం, యుద్ధానికి మద్దతుగా మారుతున్న దేశాల రోల్ పై పలు దేశాలు గమనించాల్సిన అవసరం ఉంది.

Read More : అమెరికా భద్రత కోసం ట్రంప్ కీలక నిర్ణయం

One thought on “ఉక్రెయిన్ యుద్ధానికి పూర్తి మద్దతుతో ఉత్తర కొరియా

Comments are closed.