ఇజ్రాయెల్ రక్షణ దళాల మ్యాప్ వివాదం..

ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ మ్యాప్ తీవ్ర దౌత్య వివాదానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ క్షిపణుల సామర్థ్యాన్ని వివరించే ఉద్దేశంతో విడుదల చేసిన ఆ మ్యాప్‌లో భారతదేశానికి చెందిన జమ్మూ కాశ్మీర్‌ను పొరపాటుగా పాకిస్థాన్‌లో భాగంగా చూపించారు. దీంతో భారతీయుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు తక్షణమే స్పందించి, భారత సార్వభౌమాధికారాన్ని అవమానించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ‘భారత సార్వభౌమత్వాన్ని గౌరవించండి’, ‘ఈ పొరపాటు సరిచేయండి’ అంటూ విస్తృతంగా పోస్టులు పోస్ట్ చేశారు. “దౌత్య సంబంధాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారని ఇప్పుడు మరింత స్పష్టమైంది. అందుకే భారత్ తటస్థంగా ఉంటోంది” అంటూ కొందరు వారి అభిప్రాయాలు పంచుకున్నారు.

ఇంతకుముందు కూడా ఇజ్రాయెల్ అధికారిక వర్గాల నుంచి ఇలాంటి మ్యాప్ పొరపాట్లు జరిగిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేశారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిలో ఇజ్రాయెల్ అలాంటి సైనిక చర్య తీసుకుంది. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టెలిఫోన్‌లో మాట్లాడి పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం చర్చలు జరిపారు.

ఈ సున్నితమైన సమయంలో మ్యాప్ పొరపాటు జరగడం, రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై కొంత అసహజ వాతావరణాన్ని ఏర్పరిచింది.

ఈ వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐడీఎఫ్ వెంటనే స్పందించి, తమ తప్పును గుర్తించి క్షమాపణలు తెలిపాయి. “ఈ మ్యాప్ కేవలం ఉదాహరణకోసం రూపొందించబడింది. సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో ఇది విఫలమైంది. దీని వల్ల ఎవరికైనా బాధ కలిగితే మేము క్షమాపణలు కోరుతున్నాం” అంటూ తాజాగా ఐడీఎఫ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

ఈ ఘటన దౌత్య పరంగా మరికొంత గంభీరతను సంతరించుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

Read More : ఇరాన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు:

One thought on “ఇజ్రాయెల్ రక్షణ దళాల మ్యాప్ వివాదం..

Comments are closed.