చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న, సహకరించడానికి సిద్ధంగా ఉన్న 72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరిన రంగనాథ్, సీఎస్‌ఆర్ నిధులతో చెరువులను అభివృద్ధి చేయాలని సూచించారు.
హైదరాబాద్ ఔటర్ పరిధిలో 1,025 చెరువులుంటే వాటిలో 61 శాతం చెరువులు జాడలేకుండా పోయాయని తెలిపారు. ప్రస్తుతమున్న 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హైడ్రాపై ఉందన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయపాత్ర హైడ్రా పోషిస్తోందని రంగనాథ్ పేర్కొన్నారు. మే నెలకల్లా FTL నిర్ధారణ పూర్తవుతుందని… బఫర్ జోన్‌లో 2024 జూలై లోపు నిర్మించిన నివాసాలు, అనుమతి పొందిన భవనాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని స్పష్టం చేశారు. అయితే, వాణిజ్య కట్టడాలను మాత్రం తొలగిస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఇక హైడ్రా పనితీరుపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి ప్రజలేనా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు మండిపడింది.
ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? అని నిలదీసిన న్యాయస్థానం, అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని స్పష్టం చేసింది. ఫాతిమా అనే మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు… హైడ్రా పనితీరుపై కఠిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
