తొండ ముదిరితే ఊసరవెల్లి.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి: కేటీఆర్ విమర్శలు

KTR

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ 2025 (Budget 2025)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా అందాల పోటీలు నిర్వహించడం సరికాదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. “రైతన్నలు కన్నీరు పెడుతుంటే అందాల పోటీలు అవసరమా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “ప్రతిపక్షాలపై రంకెలు వేయడం తప్ప బడ్జెట్‌లో అంకెలు పెంచడం లేదు. ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్” అని మండిపడ్డారు. “తొండ ముదిరితే ఊసరవెల్లి.. ఊసరవెల్లి ముదిరితే సీఎం రేవంత్ రెడ్డి” అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేటీఆర్ విమర్శలు చేస్తూ, “బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలు గోవిందా. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలను ప్రస్తావించలేదు. చేనేత కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,200 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు కేవలం రూ.300 కోట్లకు పరిమితం చేశారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల గురించి ప్రస్తావన లేదు. వైన్స్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అది కూడా నిలబెట్టుకోలేకపోయింది. దళిత సోదరులను మోసం చేశారు. నిరుద్యోగులకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు” అంటూ విమర్శించారు.

“ఉద్యోగ నియామక పత్రాలు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, నియామక ప్రక్రియ మాత్రం కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదు. విద్యా భరోసా గురించీ ప్రస్తావన లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేక మేడలా కూల్చేశారు. కరోనా కంటే డేంజర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం” అని కేటీఆర్ విమర్శించారు.

“తెలంగాణలో రైతులు పంటలు ఎండిపోతూ ఆవేదనకు గురవుతుంటే.. హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం ఏమిటి?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ప్రశ్నలు వర్షం కురిపించారు.

Read More

One thought on “తొండ ముదిరితే ఊసరవెల్లి.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి: కేటీఆర్ విమర్శలు

Comments are closed.