తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రైతులకు అందే పథకాలు కూడా పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, ‘‘రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును పంపిణీ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం మాత్రమే ఈ పథకాన్ని వాడుతోంది. నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ గారితో పోలిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు ఓట్లకు మధ్య ఈ నిధులు విడుదల చేస్తోంది,’’ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని రైతులు ఎరువులు, యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం మాత్రం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ, వాటిలో చాలావరకు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘‘ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోవడం వల్ల పాలన బలహీనమవుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది,’’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Read More : సీఎం రేవంత్‌కు సవాల్ విసిరే స్థాయి నీది కాదు

One thought on “తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజలను బాధిస్తున్నది : హరీష్ రావు”
Comments are closed.