గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో దర్యాప్తు వేగం

గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. తాజాగా ఈ కేసులో 6 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు, ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై గోపాలపురం పోలీస్ స్టేషన్‌లోనే 8 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆమెతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యులతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదనంగా డాక్టర్ నమ్రతకు చెందిన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు, హాస్పిటల్ అకౌంట్లు ఫ్రీజ్ చేయబడ్డాయి. ఈ ఖాతాల్లో కోట్ల రూపాయలు జమై ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. మరికొన్ని ఖాతాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా 70కి పైగా దంపతులు IVF చికిత్స కోసం వచ్చి, సరోగసి పేరుతో మోసపోయారని పోలీసులు తెలిపారు. డాక్టర్ నమ్రతతో పాటు మరికొందరు చైల్డ్ ట్రాఫికింగ్‌లో పాల్పడ్డారని పక్కా ఆధారాలు లభించాయని వెల్లడించారు. పోలీసులు మరోసారి హాస్పిటల్‌కి వెళ్లి కీలక డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కేసులో ప్రధాన ఆధారాలుగా మారనున్నాయి. మరికొన్ని అరెస్టులు కూడా త్వరలో జరగవచ్చని సమాచారం.

అలాగే, నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. డాక్టర్ నమ్రత అనుబంధంగా ఉన్న ఇతర హాస్పిటళ్లు, అక్రమ కార్యకలాపాలపై కూడా విచారణ కొనసాగుతోంది. అక్రమంగా సంపాదించిన డబ్బును వేరే ఖాతాలకు మళ్లించి ఉండే అవకాశం ఉన్నందున ఆ దిశలో దర్యాప్తు జరుగుతోంది. చిన్నారుల అక్రమ రవాణా అంశం ఉండటంతో ఈ కేసు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read More : సీఎం జంతర్ మంతర్ ధర్నాకు హాజరు