ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, ఐటీ రంగం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో మూడో రోజు ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేకించి విశాఖపట్నంలో డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలకు అవసరమైన ఎకో సిస్టమ్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ప్రారంభం కానుందని ప్రకటించారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు కూడా విశాఖలో తమ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయని వివరించారు.
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, 2026 జనవరిలో ప్రారంభమయ్యే ఈ ఎకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
పర్యటనలో భాగంగా సీఎం కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వియ్‌తో సమావేశమై, అమరావతి నగరాభివృద్ధి, విశాఖను గ్రోత్ ఇంజిన్‌గా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై చర్చించారు. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (జీఐసీ) చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోతోనూ భేటీ అయిన చంద్రబాబు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతులు, వైద్య, విద్యా రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు.
అలాగే విల్మర్ ఇంటర్నేషనల్ సంస్థ గ్రూప్ హెడ్ రాహుల్ కలేతో ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడిబుల్ ఆయిల్స్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పించేలా సహకరించాలని కోరగా, విల్మర్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది.
సీఎం పర్యటనలో కీలకంగా సింగపూర్ మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి సిద్ధమని తెలిపారు. ఈ ప్రకటనకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. గూగుల్ పాఠ్యాంశాలు, సాంకేతిక వనరులు అందించగా, టెజరాక్ట్ భౌతిక వసతులు, నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.
ఈ పర్యటనలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి. నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More : జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు? – రోజా ప్రశ్న

One thought on “విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – సీఎం కీలక ప్రకటన”
Comments are closed.