బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వద్దని కేంద్రానికి ఉత్తమ్ వినతి

uttam

దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు.

ఈ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… బనకచర్ల లింక్ ప్రాజెక్టు చట్ట విరుద్ధమని కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. తమ అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

డీపీఆర్ ఇప్పటిదాకా ఇవ్వలేదు
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటివరకు కేంద్రానికి సమర్పించలేదని తెలిపారు. గోదావరి నుంచి 1000 టీఎంసీలు, కృష్ణా నుంచి 500 టీఎంసీల బ్లాంకెట్ NOC తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈ నిబంధనలు నెరవేరితే మాత్రమే ఏపీతో బనకచర్ల అంశంపై చర్చలకు సిద్ధంగా ఉంటామని చెప్పారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశమున్నది
తెలంగాణ రైతుల్లో బనకచర్ల ప్రాజెక్టుపై ఆందోళన ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. గోదావరి–కృష్ణా నదుల నుంచి 1500 టీఎంసీల బ్లాంకెట్ అనుమతి లభిస్తే, కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఏపీకి త్వరితగతిన అనుమతులు లభిస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం కునుకు తప్పుతున్నాయని విమర్శించారు. తమ అభ్యంతరాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి నదీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారని, ఈ అంశంపైనా కేంద్రం చర్చించినట్టు తెలిపారు. చివరగా, అవసరమైతే బనకచర్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.

Read More : రియల్ ఎస్టేట్ క్షీణతపై రామ్మోహన్ రావు ఆవేదన

2 thoughts on “బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వద్దని కేంద్రానికి ఉత్తమ్ వినతి

Comments are closed.