లక్షల రూపాయల సొత్తు అపహరణ

Telangana Robbery

సూర్యాపేటలో భారీ చోరీలు: ఐదు గ్రామాల్లో దొంగలు హల్‌చల్

సూర్యాపేట జిల్లాలో శుక్రవారం దొంగలు రెచ్చిపోయారు. మూడు మండలాల్లో మాస్కులు ధరించిన దుండగులు ఐదు గ్రామాల్లో చోరీలకు పాల్పడి లక్షల రూపాయల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు.

సిద్దిపేటలోనూ అదే తంతు:

ఈ దొంగతనాలు కేవలం సూర్యాపేట జిల్లాకే పరిమితం కాలేదు. అదే రోజు సిద్దిపేట జిల్లాలోనూ దొంగలు తమ ఆగడాలను చూపారు. గజ్వేల్‌లో ఓ ఆన్‌లైన్ డెలివరీ స్టోర్‌ టార్గెట్‌గా మారింది. షట్టర్ తాళాలు పగులగొట్టి, సీసీ కెమెరా వైర్లు కత్తిరించి, నగదు, డెలివరీ వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. బీరువాను పట్టణ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకెళ్లారు.

సూర్యాపేటలో దోపిడీ ఘటనలు:

సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో అంగన్వాడీ టీచర్ సోమగాని లక్ష్మి ఇంట్లో దొంగలు చొరబడి రూ.50 వేలు, 17 గ్రాముల బంగారం, 10 తులాల వెండి అపహరించారు. గడ్డిపల్లిలో కరణం నాగేశ్ కుటుంబం పెళ్లి కార్యక్రమానికి వెళ్లిన సమయాన్ని ఉపయోగించుకుని దొంగలు రూ.1.76 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అదే వీధిలో కోన శ్రీనయ్య ఇంట్లోనూ చోరీ చేసి రూ.36 వేలు దుండగులు స్వాహా చేశారు.

నేరేడుచర్లలో కేటుగాళ్ల దాడి:

నేరేడుచర్లలోని 5వ వార్డు నర్సయ్యగూడెంలో పేరం వెంకన్న, లింగమ్మ దంపతులు పనికి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.6.50 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం, కల్మెట్‌తండాలలోనూ దొంగలు తమ పని సాధించారు.

పోలీసుల దర్యాప్తు:

సూర్యాపేట జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ వరుస దొంగతనాల్లో మొత్తం రూ.13.65 లక్షల విలువైన ఆస్తి చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

READ MORE