CM Chandrababu: మహిళల రక్షణకు శక్తి యాప్ ప్రారంభం, భూ కబ్జాలపై కఠిన చర్యలు

cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ యాప్‌ను ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేస్తే 6 నుంచి 9 నిమిషాల్లో పోలీసుల సహాయం అందుబాటులోకి వస్తుందని వివరించారు. పోలీసులు సకాలంలో స్పందించకపోతే వారికి శిక్షలు తప్పవని సీఎం హెచ్చరించారు. గతంలో దిశా యాప్ విఫలమవగా, శక్తి యాప్ 100% పనిచేసేలా రూపొందించామని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో భూ వివాదాలు, భూ కబ్జాలు అధికంగా ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా గుజరాత్ తరహా కఠిన చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురానున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణపై ప్రభుత్వం గట్టిగా వ్యవహరించనుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా వ్యాపించాయని ఆయన విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ‘ఈగల్ టీమ్’ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ఎకరాలో కూడా గంజాయి సాగు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

మహిళల్లో చైతన్యం పెంచడం ఎమ్మెల్యేల బాధ్యతని సీఎం తెలిపారు. శక్తి యాప్‌ను ప్రతి మహిళా తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శక్తి యాప్ విస్తృతంగా ప్రజల్లో ప్రచారం కల్పించాలని టీడీపీ క్యాడర్‌కు సూచించారు.

Read More