కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అదనపు నిధుల కోసం వినతి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా ₹5,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh) ప్రోత్సాహక పథకం కింద ₹250 కోట్లు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (SASCI) పథకం కింద ₹2,010 కోట్లు లభించాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరించారు.

‘పూర్వోదయ’ పథకం అమలుపై చర్చ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పూర్వోదయ’ పథకాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. ఈ పథకం విధివిధానాలను త్వరగా రూపొందించి, అమల్లోకి తేవాలని ఆర్థిక మంత్రిని కోరారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ఆర్థిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

Read More : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు – పవన్ కల్యాణ్‌కు చిరు ఆశీస్సులు

One thought on “కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం

Comments are closed.