భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ సెలక్షన్ కమిటీలలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
పురుషుల సెలక్షన్ కమిటీలో రెండు ఖాళీలు
ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో త్వరలో రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ కమిటీలో అగార్కర్‌తో పాటు ఎస్.ఎస్. దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్. శరత్ సభ్యులుగా ఉన్నారు. సెలక్టర్ల కాంట్రాక్టులను ప్రతి సంవత్సరం పునరుద్ధరిస్తామని, ప్రస్తుతం ఎవరి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది ఈ కమిటీనే.
అర్హత ప్రమాణాల్లో మార్పు లేదు
సెలక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలలో ఎలాంటి మార్పులు చేయలేదని బీసీసీఐ పేర్కొంది. కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. లేదా 10 వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) లేదా 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మహిళలు, జూనియర్ కమిటీలలోనూ ఖాళీలు
మరోవైపు, నీతూ డేవిడ్ నేతృత్వంలోని మహిళల జాతీయ సెలక్షన్ కమిటీలో ఏకంగా నాలుగు స్థానాల భర్తీకి బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్-22 స్థాయి వరకు జట్లను ఎంపిక చేసే జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో కూడా ఒక సభ్యుడి స్థానం ఖాళీగా ఉంది. ఇది చీఫ్ సెలక్టర్ పదవి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీలోగా సమర్పించాలని బోర్డు సూచించింది.
Read More : బంగ్లాదేశ్ మహిళల జట్టుకు షాక్ – అండర్-15 బాలుర చేతిలో ఘోర పరాజయం

One thought on “క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం”
Comments are closed.