ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తొలి అడుగు వేశారు. వర్చువల్‌గా రాష్ట్రవ్యాప్తంగా 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించారు. అలాగే, 14 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, 25 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, అసంఘటిత రంగాల్లో అధికంగా కార్మికులు ఉన్నారని, ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడినవారికి అభివృద్ధి అవకాశాలు కల్పించాలన్నది తమ లక్ష్యమన్నారు.
ఇసుక ఉచితం – కార్మికులకు మద్దతు
గత ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహించిందని విమర్శించిన సీఎం, తమ పాలనలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. భవన కార్మికుల సంక్షేమం కోసం భవన అనుమతుల ప్రక్రియను సులభతరం చేశామని తెలిపారు. నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని వివరించారు.
అమరావతిని కోటీశ్వరుల నగరంగా తీర్చిదిద్దే లక్ష్యం
34వేల ఎకరాల్లో నిర్మిస్తున్న అమరావతికి 29వేల మంది రైతులు భూములు ఇచ్చారని.. వారి త్యాగాలను నిలబెట్టడం టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొందరికి అభివృద్ధి ఇబ్బంది అనిపిస్తుందని వ్యాఖ్యానించిన ఆయన, తాము మాత్రం సామూహిక ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఎంఎస్‌ఎంఈలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి
175 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఒక్కో మండలానికి ఒక్క పార్కు ఏర్పాటు చేయాలన్నది తమ సంకల్పమన్నారు. పరిశ్రమలు పెట్టే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. విద్యాసంస్థలు – పరిశ్రమల అనుసంధానంతో యువతకు అవకాశాలు పెరుగుతాయన్నారు.
ఆర్థికంగా పేదలకు అండగా ఉంటాం
యానాదుల పేదరికాన్ని తుడిచివేయడమే లక్ష్యంగా పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులకూ పరిశ్రమల అవకాశాలు కల్పించాలన్నదే తమ ఆలోచన అని వివరించారు. మహిళలు పరిశ్రమల రంగంలో ముందుకు రావాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఆకాంక్షించారు.
సమగ్ర అభివృద్ధికి కొత్త ప్రణాళిక
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐదు రీజనల్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, రైల్వే లైన్లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఇలా అన్ని మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల నీటిని ఆత్మకూరుకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల, ఉద్యోగ అవకాశాలతో ఆత్మకూరు అభివృద్ధికి నడుం బిగిస్తామని తెలిపారు.
Read More : ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

One thought on “సీఎం చంద్రబాబు అభివృద్ధి సంకల్పం..”
Comments are closed.