ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అమోఘమని, అభివృద్ధికి వారి కృషి అత్యవసరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మే డే సందర్భంగా ఆయన కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై, శ్రామికుల హక్కులు, సంక్షేమంపై స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఇకపై శ్రామికులను ‘కూలీలు’ అని కాకుండా ‘ఉపాధి శ్రామికులు’ అని గౌరవంగా పిలవాలని పిలుపునిచ్చారు. “డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా ముఖ్యమైన విషయం. కష్టపడి పనిచేసే వర్గానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. శ్రామికులు లేకపోతే దేశం అభివృద్ధి చెందదు” అని వ్యాఖ్యానించారు.

ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పని ప్రదేశంలో మరణించే పరిస్థితిలో ఉన్న కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఇచ్చిన రూ.50 వేల పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే, అన్ని ఉపాధి శ్రామికుల కోసం రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఉపాధి పనుల వేళల్లో మార్పులు చేయాలని సూచించారు. ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తి చేయాలని, అవసరమైతే సాయంత్రం 4 తర్వాత మళ్లీ కొనసాగించాలని చెప్పారు. అవసరమైన వైద్య సేవల కోసం గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ నిధులు ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశామనీ, ఇందులో రూ.6,190 కోట్లు కూలీల వేతనాలకే ఖర్చు చేశామని వివరించారు. ‘పల్లె పండుగ’ కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. చివరిగా, “చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం శ్రామికుల సంక్షేమానికే పెద్దపీట వేస్తోంది. పనిచేసే వారికి పూర్తి అండగా నిలుస్తాం” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read More : జగన్‌కు కూటమి ప్రభుత్వం ఆహ్వానం

One thought on “ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Comments are closed.