తెలంగాణ భవన్‌లో మే డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “భౌగోళిక తెలంగాణ సాధించాం.. కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అసమానతలను ప్రస్తావిస్తూ ఆమె మాట్లాడుతూ, “రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 8 లక్షలుంటే, పక్కనే వున్న వికారాబాద్ జిల్లాలో అది కేవలం రూ. 1.58 లక్షలే. ఇదే అంశం సామాజిక తెలంగాణ లోపాన్ని సూచిస్తుంది. పది కిలోమీటర్ల దూరంలోనే ఈ అంతరాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘాటుగా ఉందో అర్థం చేసుకోవాలి” అని అన్నారు.
రైతు బంధు పథకంపై స్పందించిన కవిత, “ఎకరం భూమి ఉంటే రూ.10 వేలు, పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చాం. కానీ భూమిలేని కార్మికులకు ఏం చేయలేకపోయాం. ఇది ప్రభుత్వంగా మనల్ని ఆలోచింపజేసే అంశం” అని తెలిపారు. భూమి ఉన్నవారితో పాటు భూమిలేనివారికి కూడా రక్షణ కల్పించే విధంగా భవిష్యత్తులో పాలసీలు ఉండాలన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు.
మే 20న జరగనున్న జాతీయ స్థాయి కార్మిక సంఘాల సమ్మెకు బీఆర్‌ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తుందని కవిత ప్రకటించారు. మే డే స్పూర్తితో రాష్ట్రంలోని అసమానతలు తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని, సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇక భవిష్యత్తులో సమానత్వం, సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి చేకూరేలా మార్గదర్శక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
Read More : దోమలపెంట గ్రామంలో వారం రోజుల్లో మూడుసార్లు దర్శనమిచ్చిన చిరుత

One thought on “కవిత కీలక వ్యాఖ్యలు: భౌగోళిక తెలంగాణ సాధించాం..”
Comments are closed.