ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు నూలి గ్రౌండ్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. మంత్రి నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గత ఐదేళ్ల ఇబ్బందులు
చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాటు తనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. టీడీపీకి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉందని, ఇకపై మరింత బలోపేతంగా ముందుకు సాగాలని సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా టీడీపీ ఎప్పుడూ అధైర్యపడలేదని అన్నారు. కార్యకర్తలు ఎల్లప్పుడూ తన వెంటే నిలబడ్డారని కొనియాడారు.
పొత్తుపై వివరణ
గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనానికి గురవుతుందనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విధ్వంసమైన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు.
యువరక్తం ప్రాముఖ్యత
టీడీపీకి అనుభవం అవసరమైతే, అదే విధంగా వేగంగా పని చేసే యువరక్తం కూడా అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. యువతనే పార్టీ భవిష్యత్తు అని పేర్కొన్నారు. ప్రజల ఆమోదంతోనే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. పార్టీకి నష్టం కలిగించే ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలకు ప్రోత్సాహం
మహిళలకు శాసనసభ, పార్లమెంటులో త్వరలో 1/3 రిజర్వేషన్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ప్రకటించారు. మహిళలు కూడా మగవారితో సమానంగా రాజకీయాల్లో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. వచ్చే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి టీడీపీ కార్యకర్త పని చేయాలని సూచించారు.
మహానాడు – కడపలో
చంద్రబాబు మాట్లాడుతూ ఈసారి మహానాడు సమావేశాన్ని కడపలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ పుట్టిన తర్వాత తొలిసారి కడపలో మహానాడు జరుగుతుందన్న విషయాన్ని తెలిపారు. పార్టీ గెలుపును భరోసా ఇచ్చే బలహీన వర్గాలే ప్రధాన శక్తిగా నిలవాలని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన నేతలకు పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు.

One thought on “2029 ఎన్నికల దృష్ట్యా కీలక సూచనలు చేసిన సీఎం”
Comments are closed.