వరంగల్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిలుకూరి బ్రదర్స్ క్లాత్ స్టోర్ యజమాని కుటుంబ సభ్యులు బ్యాంకు ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే, వరంగల్‌కు చెందిన చిలుకూరి బ్రదర్స్ కుటుంబ సభ్యులు వ్యాపార అవసరాల కోసం ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. అయితే వ్యాపారంలో నష్టాల కారణంగా వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో బ్యాంకు ఏజెంట్లు పలుమార్లు వారి ఇంటి వద్దకు వచ్చి తీవ్రంగా వేధించారు. అందరూ చూస్తుండగానే అవమానకరంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని కించపరిచారని సమాచారం. ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక చివరకు చిలుకూరి బ్రదర్స్ కుటుంబ సభ్యులు వరంగల్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బాధితులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన తర్వాత ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
