భారత్ చర్యలు ప్రారంభం

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ వద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన ఓ జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అనంతరం పాకిస్థాన్ రేంజర్లు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులో ఉన్న జవాన్‌ పేరును కానిస్టేబుల్ పీకే సింగ్‌గా గుర్తించారు. ఆయన పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. ఫిరోజ్‌పూర్ సరిహద్దులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో, స్థానిక రైతులతో కలిసి ఉన్న సందర్భంలో, ఆయన తెలియకుండానే సరిహద్దు రేఖ దాటి పాక్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత బలగాలు తక్షణ చర్యలు ప్రారంభించాయి. జవాన్‌ను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇరు దేశాల సైనిక కమాండర్లు స్థానిక స్థాయిలో చర్చించి సమస్యను పరిష్కరించడం సాధారణ ప్రక్రియ అని అధికారులు తెలిపారు.

జవాన్ పీకే సింగ్ యూనిఫామ్‌లోనే ఉండగా, ఆయన వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, గతంలోని అనుభవాల నేపథ్యంలో ఈ ఘటనపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ ఈ సంఘటనను ఇతర ద్వైపాక్షిక అంశాలతో ముడిపెట్టే అవకాశం ఉందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం జవాన్ విడుదల కోసం ఆర్మీ అధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు. గతంలో ఇలాంటి అనుకోని సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నప్పటికీ, అవి సాధారణంగా పరస్పర చర్చల ద్వారా పరిష్కారమయ్యాయని గుర్తుచేశారు.

Read More : పాక్ హైకమిషన్ వద్ద కేక్ బాక్స్ కలకలం