బంగ్లాదేశ్ మహిళల జట్టుకు షాక్ – అండర్-15 బాలుర చేతిలో ఘోర పరాజయం

బంగ్లాదేశ్ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. త్వరలో జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా సీనియర్ మహిళల జట్టు, అండర్-15 బాలుర జట్టుతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫలితం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. బీకేఎస్‌పీ-3 మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అండర్-15 బాలుర జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వారు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేశారు. కెప్టెన్ బయాజిద్ బోస్తామి 46 పరుగులు, అఫ్జల్ హుస్సేన్ 44 పరుగులు సాధించి జట్టుకు బలమైన ఆధారం కల్పించారు.

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహిళల రెడ్ టీమ్, బాలుర బౌలింగ్‌కు తట్టుకోలేక 38 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది. అలిముల్ ఇస్లాం ఆదిబ్ 12 పరుగులకే 3 వికెట్లు తీశాడు. అఫ్రిది తారిఖ్, అబ్దుల్ అజీజ్ చెరో రెండు వికెట్లు తీసి మహిళల జట్టు పతనానికి కారణమయ్యారు.

మహిళల జట్టులో కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశారు. షర్మిన్ సుల్తానా చేసిన 20 పరుగులే ఆ జట్టులో అత్యధికం కావడం గమనార్హం. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌కు సన్నాహకంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఫలితం జట్టు సిద్ధతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Read More : అజిత్ అగార్కర్ పదవీకాలం 2026 వరకు పొడిగింపు

One thought on “బంగ్లాదేశ్ మహిళల జట్టుకు షాక్ – అండర్-15 బాలుర చేతిలో ఘోర పరాజయం

Comments are closed.