పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రం

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, ఆ దేశ జనాభాలో సగానికి సమీపంగా ఉన్న 44.7 శాతం మంది పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారు. రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి పతనం వంటి అంశాలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. రోజుకు 4.20 డాలర్ల (రూ. 350) కన్నా తక్కువ సంపాదించే వారిని పేదలుగా పరిగణిస్తే, పాకిస్థాన్‌లో దాదాపు సగం మంది ఈ వర్గంలోనే ఉన్నారు. వీరిలో సుమారు 16.5 శాతం మంది (దాదాపు 3.98 కోట్లు) రోజుకు 3 డాలర్ల (రూ. 250) కన్నా తక్కువతోనే జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో 4.9 శాతం మాత్రమే తీవ్ర పేదరికంలో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాలు కూడా ఆర్థిక వ్యవస్థ దారుణ స్థితిని చూపిస్తున్నాయి. 2022లో 1,766 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం, 2023లో 1,568 డాలర్లకు పడిపోయింది. అంటే ఏడాదిలోనే 11.38 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా 375 బిలియన్ డాలర్ల నుంచి 341.6 బిలియన్ డాలర్లకు క్షీణించింది.

ఇక ద్రవ్యోల్బణం ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతోంది. 2024 డిసెంబర్ తర్వాత ఈ ఏడాది జూలైలోనే 4.1 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ముఖ్యంగా ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సాధారణ కుటుంబాలు భోజనం, విద్య, వైద్యం వంటి అవసరాలను కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో విద్యకు కేవలం 44 శాతం, ఆరోగ్యానికి జీడీపీలో ఒక శాతం మాత్రమే కేటాయించడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది.

ఇక ప్రాంతీయ అసమానతలు సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నగరాలు అభివృద్ధి చెందుతున్నా, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలు వెనుకబడి పోతున్నాయి. దీని వల్ల అసంతృప్తి, సామాజిక అశాంతి పెరుగుతోందని పాకిస్థాన్ అబ్జర్వర్ పత్రిక పేర్కొంది.

Read More : బాబా వంగా 2026 జోస్యాలు: యుద్ధం, విలయం భయం

One thought on “పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రం

Comments are closed.