జగన్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా విస్మరించి, రాజ్యాంగ నిబంధనలను అడ్డగోలు గా ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు.

2025 జూన్ 25న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) రెండో విడతగా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDs)ను జారీ చేయడం ద్వారా రూ.5,526 కోట్లు సమీకరించిందని తెలిపారు. ఇది 9.30 శాతం అధిక వడ్డీ రేటుతో జరుగగా, మొత్తం బాండ్ల విలువ ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిందని జగన్ వివరించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉందని, ఇప్పటికే నోటీసులు కూడా జారీ అయ్యాయని ఆయన గుర్తు చేశారు.

ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులు రెవెన్యూ వ్యయాలకే వినియోగించబడుతున్నాయన్నది స్పష్టమవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా ప్రైవేట్ పార్టీలకు డబ్బు వెళ్తుండటంపై గంభీర ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా డైరెక్ట్ డెబిట్ ఆదేశాలపై ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండానే ప్రైవేటు వ్యక్తులు నిధులు విత్‌డ్రా చేసుకోవడం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించారు. పలు కీలక ఆర్టికల్స్‌ (203, 204, 293(1)) ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ, ఖనిజ సంపద రూపంలో రూ.1.91 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కేవలం రూ.9,000 కోట్ల బాండ్ల కోసం తాకట్టు పెట్టడం ఏదైనా ప్రభుత్వానికి తగిన విషయమా? అంటూ ప్రశ్నించారు.

తక్కువ సురక్షితమైన స్థితిలో ఉన్న ఈ బాండ్లపై 9.30 శాతం వడ్డీ చెల్లించడం వల్ల ఏటా రూ.235 కోట్ల అదనపు భారం రాష్ట్రంపై పడుతోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి రుణాల కంటే ఇది 2.6 శాతం ఎక్కువ వడ్డీ రేటేనని వివరించారు. ఇదిలా ఉండగా, కేవలం 13 నెలల్లో కూటమి ప్రభుత్వం సమీకరించిన రుణాలు, గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న రుణాల్లో 50 శాతానికి పైగానే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పారదర్శకత పాటించాలనీ, ప్రజల భవిష్యత్‌ను బలికొట్టే విధంగా ఈ చర్యలు ఉండకూడదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఆర్థిక చర్యలు ఎవరి కోసం? ఎవరి లాభం కోసం? అనే ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వాలనీ జగన్ డిమాండ్ చేశారు.

Read More : రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రారంభం