ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి నుంచి చివరి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో గత ఎన్నికల సమయంలో బీజేపీలో ఏర్పడిన అసంతృప్తికి పార్టీ అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
ఎన్నికల సమయంలో బీజేపీలో అసంతృప్తి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు టికెట్లు కేటాయించకపోవడంతో సంఘపరివార్ నేతలు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆశించిన వీర్రాజుకు అవకాశం రాకపోవడంతో బీజేపీ ఆంతరంగికంగా విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా, సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర చర్చ నడిచింది.
వీర్రాజు ఎంపికపై వ్యూహాత్మక దృష్టి
ఈ దశలో బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం కీలక నిర్ణయంగా మారింది. తొలుత పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, చివరకు వీర్రాజుకే ప్రాధాన్యత ఇచ్చారు. సీనియారిటీతో పాటు, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసే విధంగా ఈ ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఆయన అధికారికంగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఏపీ ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు
ఏపీలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ కోటా స్థానాలు ఉండగా, మూడు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేన తరఫున కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. చివరి స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, ఆ పదవికి సోము వీర్రాజును ఎంపిక చేశారు.
