“మాతో పెట్టుకుంటే మాడి మాసిపోతారు”

Buddha Venkanna and ktr

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై ఏపీ టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రజలు బుద్ధి చెప్పినా కూడా కేటీఆర్ తీరు మారలేదని విమర్శించారు. ముఖ్యంగా ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఇదే తీరుగా మాట్లాడారని గుర్తుచేశారు.

“పక్క రాష్ట్రంలో చేసుకోండి” అన్నందుకు ప్రభుత్వం పోయింది – బుద్దా వెంకన్న

“పక్క రాష్ట్రంలో చేసుకోండి” అన్నందుకు మీ ప్రభుత్వం కూలిపోయిందని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా నాశనం కావడానికి కేటీఆర్‌ వెకిలి వ్యాఖ్యలే కారణమని బుద్దా వెంకన్న మండిపడ్డారు. గతంలో కేసీఆర్ కూడా ఇలానే నోరు పారేసుకున్నప్పుడు ప్రజలు గుణపాఠం నేర్పారని గుర్తుచేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నారని, ఈ తీరును మార్చుకోకపోతే సిరిసిల్లలో కూడా ఓటమి తప్పదని హెచ్చరించారు.

“ఏపీపై నోరు జాగ్రత్త”.. బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

ఏపీపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ, పెట్టుబడులపై అనవసర ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ తీరుపై బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉంది. ఆయనను చూసి ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. కానీ, తెలంగాణకు పెట్టుబడులు రావట్లేదని అనడం మీ తప్పుడు విధానాల ఫలితం” అంటూ మండిపడ్డారు.

“జగన్ అవినీతి పరుడితో కలిసి మీరు ఏపీ గురించి మాట్లాడే హక్కు ఏమిటి? కేటీఆర్ నీ నోరు జాగ్రత్త. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు అండ లేకుండా పోయింది. అయినా ఏపీ గురించి మాట్లాడుతున్నావు” అంటూ ధ్వజమెత్తారు.

“చంద్రబాబు ఓ బ్రాండ్.. దేశానికి అవసరం”

“చంద్రబాబు కటౌట్ చాలు.. ఈ దేశానికి లీడర్‌గా చాలని” బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతితో చంద్రబాబును ఎన్నో ఇబ్బందులు పెట్టారని, కానీ ప్రజలు చంద్రబాబును నమ్మి రోడ్ల మీదకు వచ్చి పోరాడారని తెలిపారు. చంద్రబాబు పాలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఓ ఇమేజ్ ఉందని, కేటీఆర్ లాంటి వారు అనవసర వ్యాఖ్యలు చేసినా ఆయన గొప్పతనం తగ్గదని స్పష్టం చేశారు.

“సిరిసిల్లలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు”

“ఏపీ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే సిరిసిల్లలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు” అంటూ బుద్దా వెంకన్న హెచ్చరించారు.

ఎమ్మెల్సీ పదవిపై స్పందించిన బుద్దా వెంకన్న

ఎమ్మెల్సీ పదవి తనకు రాకపోయినా, చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉందని బుద్దా వెంకన్న అన్నారు. “నాకు చంద్రబాబు దేవుడితో సమానం. రాజకీయాల్లో పదవులు గెలుపోటములు సహజం. చంద్రబాబు ఎప్పుడూ ఏది చేయాలో ఆయనకే తెలుసు. నాకు పదవి ఇవ్వకపోయినా అసంతృప్తి లేదు” అని స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. కేటీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

Read More