కేంద్రం స్పందన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలపై చేసిన విజ్ఞప్తితో కేంద్రం స్పందించింది. మిర్చి ఎగుమతులను పెంచే అవకాశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షిస్తున్నారు. మార్కెట్ జోక్యం పథకం కింద మిర్చి రైతులకు వీలైనంత ఎక్కువ సాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. సీఎం విజ్ఞప్తి నేపథ్యంలో తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.
రామ్మోహన్ నాయుడు సమావేశం
ఏపీ సీఎం విజ్ఞప్తి, కేంద్ర మంత్రుల ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు. మిర్చి రైతులకు సహాయంగా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో రామ్మోహన్ నాయుడు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిర్చి రైతుల సమస్యల పరిష్కార మార్గాలపై కీలక చర్చలు జరిగాయి.
చంద్రబాబు ప్రధాన డిమాండ్లు
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపై దృష్టి సారించారు. కేంద్రం మార్కెట్ జోక్యం పథకం కింద 25% పంట కొనుగోలు పరిమితిని తొలగించి, రైతులకు గరిష్ట స్థాయిలో మద్దతు ధర అందించాలని కోరారు. మిర్చి ధరలను నిర్ణయించే విధానం రైతుల ఉత్పాదన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉండటంతో, వాటిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి మిర్చి కొనుగోలు వ్యయాన్ని పంచుకునే విధానాన్ని రూపొందించాలని సూచించారు.
తక్షణ చర్యలు
మిర్చి ఎగుమతుల పరంగా కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

2 thoughts on “మిర్చి రైతులకు కేంద్రం ఊరట.. మార్కెట్ జోక్యంలో కీలక నిర్ణయం”
Comments are closed.