ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి

Assembly

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. క్వశ్చన్ అవర్‌లో సభ్యులు అడిగిన వివిధ అంశాలపై మంత్రులు సమాధానాలు ఇచ్చారు. భూ సమస్యలు, తలసేమియా వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

రెవెన్యూ సమస్యలపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందన
అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాల అంశంపై సభ్యులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, రెండు లక్షలకు పైగా భూ వివాదాల కేసులు వచ్చాయని మంత్రి తెలిపారు. భూ హక్కులు కలిగిన వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం భూ సర్వేను అవినీతి మాయగా మార్చిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే మంచి నిర్ణయమని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ వివరణ
గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావుడి చేసిందని, కానీ ఒక జీఓ ఇచ్చి బాధ్యత తప్పించుకున్నదని మంత్రి అనగాని విమర్శించారు. అయితే ప్రస్తుతం జర్నలిస్టుల హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రత్యామ్నాయ పంటలపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివరణ
అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ఆయిల్ పామ్ సాగుపై చర్చ జరిగింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు డ్రిప్ ఇరిగేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.

తలసేమియా వ్యాధిపై మంత్రి సత్యకుమార్ ప్రకటన
తలసేమియా వ్యాధి బాధితులకు ఆర్థిక సాయంపై సభ్యులు ప్రశ్నించగా, మంత్రి సత్య కుమార్ సమాధానం ఇచ్చారు. తలసేమియా బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం న్యాయం చేస్తోందని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించడంపై మరింత దృష్టి పెడతామని చెప్పారు. తలసేమియాపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నదని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Read More

One thought on “ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి

Comments are closed.