PM : గరివిడి వెటర్నరీ కాలేజ్‌కు కేంద్ర ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. విజయనగరం జిల్లా గరివిడిలో ఉన్న వెటర్నరీ కాలేజ్‌కు మళ్లీ శాశ్వత సభ్యత్వం కొనసాగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలేజ్ అభివృద్ధి దిశగా కీలకమైన మరో నిర్ణయాన్ని తీసుకుంటూ, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి లలన్ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. గరివిడి వెటర్నరీ కాలేజ్ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించి, శాశ్వత అనుమతుల పునరుద్ధరణ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన లలన్ సింగ్, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరో కాలేజ్‌కి తరలించే ఏర్పాట్లకూ కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

2018లో టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ కాలేజ్, గత ప్రభుత్వ కాలంలో నిబంధనలకు లోబడి అభివృద్ధి జరగకపోవడంతో 2023లో కేంద్ర అనుమతులు రద్దయ్యాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ కాలేజ్‌కు అవసరమైన మౌలిక వసతులపై దృష్టిసారించి చర్యలు చేపడుతోంది. వచ్చే నాలుగైదు నెలల్లో అన్ని నిబంధనలను పాటిస్తూ పూర్వ వైభవాన్ని కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం మళ్లీ అనుమతులు ఇచ్చేందుకు అంగీకరించడంతో గరివిడి వెటర్నరీ కాలేజ్‌కు మరొకసారి వెలుగులు పుంజాయి.

Read More : అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు – మంత్రి