ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కడపలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) అధికారులతో సమావేశమైన ఆమె, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ, “గత ప్రభుత్వ హయంలో సీఓఏ అనుమతులు లేకుండానే యూనివర్సిటీలో అడ్మిషన్లు జరిపారు. ప్రస్తుతం విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక పోవడం వల్ల వందలాది మంది భవిష్యత్తు అనిశ్చితిలో నిలిచింది. సీఓఏ అనుమతులు లేకుండా లైసెన్సులు కూడా రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి బాధలను నేను ప్రత్యక్షంగా చూశాను” అని పేర్కొన్నారు. యూనివర్సిటీకి అవసరమైన అనుమతులు లేకుండా ప్రారంభించడం పెద్ద తప్పుగా షర్మిల అభివర్ణించారు. ఈ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా, ఫలితం లేకుండా పోయిందని వివరించారు.
సీఓఏ అనుమతులు పొందేందుకు తక్షణమే చర్యలు చేపట్టి, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఒక నెల గడువు ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరపున మరింత బలమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. అధికారులు ఈ అంశంపై సానుకూలంగా స్పందించారని, త్వరలో పరిష్కారం దిశగా ముందడుగు పడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More : Photos : రాయుడి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి
