తండ్రి కిరాతక చర్య

Vanapalli Chandrakishore

అభం, శుభం తెలియని ఆరేళ్ల చిన్నారులను హతమార్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కాకినాడలో కలకలం రేపింది. కాకినాడ గ్రామీణం తోట సుబ్బారావు నగర్లో నివాసం ఉంటున్న ఓఎన్జీసీ ఉద్యోగి వానపల్లి చంద్రకిశోర్ (Vanapalli Chandrakishore) ఈ నెల 14న తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ప్రాణాలు తీసుకున్నాడు.

చంద్రకిశోర్ కుటుంబసభ్యుల కథనం ప్రకారం, ఆయన ధైర్యవంతుడని, పిల్లలంటే ఎంతో ప్రేమగల వ్యక్తి అని తెలిపారు. అయితే పిల్లలు సరిగా చదవడం లేదనే ఆవేదనలో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ హత్యకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక ఒత్తిడితో తీవ్ర నిర్ణయం
పిల్లల చదువుకు సంబంధించి రూ. లక్షన్నర ఫీజు ఉండటంతో, ఇటీవల వారిని తక్కువ ఫీజుతో కూడిన మరో పాఠశాలకు మార్చాల్సి రావడంతో చంద్రకిశోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని బంధువులు పేర్కొన్నారు.

సూసైడ్ నోట్‌తో వెల్లడి
ఈ ఘటనపై సర్పవరం స్టేషన్ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ (ASP Manish Devaraj Patil), సీఐ పెద్దిరాజు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని, అది చంద్రకిశోరే రాసినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. ఆ లేఖలో, తన పిల్లలు సరిగా చదవడం లేదని, భవిష్యత్తులో వారు స్థిరపడలేరనే భావనతో మానసికంగా కుంగిపోయినట్లు వివరించారని తెలిపారు.

తల్లిదండ్రులకు హితవు
ఈ ఘటనను ఉదాహరణగా తీసుకుని పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఒత్తిడి తేవద్దని పోలీస్ అధికారులు సూచించారు. చిన్నతనంలోనే పిల్లల భవిష్యత్తుపై అనవసరంగా ఒత్తిడి చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.

Read More