ఏపీలో నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు: సీఎం చంద్రబాబు.

chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణకు నూతన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించబడింది. అనంతవరం గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే కోటి మొక్కలు నాటుతున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతోందని, దీంతో గ్రీన్ కవర్ కూడా పెరుగుతోందని వివరించారు.

గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, “వారికి చెట్లు నరికడం తప్ప, నాటడం తెలియదు. చెట్లను నరికి రహదారులను శోభిల్లకుండా చేశారు. కింద చెట్లు నరికిస్తే పై నుంచి వెళ్తున్న సీఎం ఏమి చూస్తారు?” అంటూ ప్రశ్నించారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టేనన్న భావనతో కొన్ని దేశాలు కఠిన చట్టాలు పెట్టాయని గుర్తుచేశారు.

“ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కిచెన్ గార్డెన్, రూఫ్‌టాప్ గార్డెన్ ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించేందుకు వచ్చే ఏడాది నాటికి చర్యలు తీసుకుంటాం. నల్లమల అడవుల్లో విలువైన వనమూలికలను, ఎర్రచందనాన్ని కాపాడుకోవాలి. చెత్తను ఇంధనంగా మార్చే ‘వెస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తాం,” అని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా “రాఖీ బంధం – విత్తన బంధం” కార్యక్రమాన్ని ప్రకటించారు. రాఖీ కట్టే చెల్లెమ్మలకు వారి అన్నల నక్షత్రానికి అనుగుణంగా విత్తనాలు అందజేస్తామని చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తామన్నారు.

అంతేగాక, రాష్ట్రంలోని అన్ని 175 నియోజకవర్గాల్లో “నగర వనాలు” (Urban Forests) ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Read More : మైలవరం చిన్నారి హత్యాచార కేసు