నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం అల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. “జగనన్నా.. మాకు దిక్కెవరన్నా?” అనే మాటలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య అనుచరులు సైతం ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఆయన అవినీతి, అక్రమాలకు సంబంధించిన విషయాలను ఇటీవల ప్రముఖ అనుచరుడు సుకుమార్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా బహిర్గతం చేశారు. దీంతో వైసీపీలో ఆంతర్యుద్ధం భగ్గుమంటోంది.
ఇక, మరో నలుగురు ముఖ్య అనుచరులు సహా పలువురు శ్రేణులు త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వెన్నుపోటు దినోత్సవం రోజునే పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇప్పటికే కావలి రూరల్ మండలంలో మత్స్యకార సంఘాల నేతలతో సమావేశమైన పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దగదర్తి మండలంలో వైసీపీ వ్యతిరేకంగా ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం, కావలి టౌన్‌లో కీలక అనుచరులు పార్టీని వదిలి టీడీపీలోకి చేరే సంకల్పం చేయడం వంటి పరిణామాలు పార్టీకి పెను దెబ్బగా మారుతున్నాయి.
ఇక, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైసీపీ నేతలు వరుసగా పార్టీకి వీడ్కోలు చెబుతున్నారు. “పదిహేను సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేశాం.. ఇప్పుడు మనల్ని పట్టించుకునే వారు లేరు” అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్‌లో ఉండగా, రామిరెడ్డి స్పందించకపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశను పెంచుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నిస్తూ అల్లూరు ప్రాంతంలో ఫ్లెక్సీలు వెలిసిన విధానం వైసీపీలో రాజకీయ వాతావరణాన్ని మారుస్తోంది.
Read More : వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు.
