అంబేద్కర్ జయంతి: రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు సీఎంల నుండి ఘన నివాళి

Ambedkar Jayanti 2025

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పుష్పాంజలులు అర్పించి, ఆయన సేవలను స్మరించారు. అలాగే స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, జేపీ నడ్డా, ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు అనేకమంది పార్లమెంటు సభ్యులు నివాళులర్పించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ, అట్టడుగు వర్గాల కోసం నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధిని అందిస్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ సేవలను స్మరిస్తూ, ఆయన రాజ్యాంగ నిర్మాతగా, తొలి న్యాయ మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ట్వీట్ చేశారు.

సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్, అణగారిన వర్గాల పక్షంగా జీవితాన్ని అంకితమిచ్చిన మహానుభావుడు. కుల వివక్ష నిర్మూలన కోసం కృషి చేసిన అంబేద్కర్‌కు 1990లో భారతరత్న పురస్కారం లభించింది. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటికీ సమాజాన్ని మారుస్తూనే ఉన్నాయి.

Read More