బీసీసీఐ సెలెక్టర్లపై యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వడానికి తన కుమారుడికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఒక్క టెస్టులో కూడా అవకాశం ఇవ్వకుండా బెంచ్‌కే పరిమితం చేయడం తగదని మండిపడ్డారు.
ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులోనూ ఈశ్వరన్‌కు అవకాశం దక్కకపోవడంపై రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా కుమారుడి అరంగేట్రం కోసం రోజులు లెక్కించడం మానేశాను. ఇప్పుడు సంవత్సరాలనే లెక్కిస్తున్నాను. గత మూడు సంవత్సరాలుగా అతడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. తన బాధ్యతగా పరుగులు చేశాడు. కానీ ఎంపికలో అన్యాయం జరిగింది” అని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ అన్నారు.
అభిమన్యు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడని, గతేడాది నుంచి ఇప్పటివరకు 864 పరుగులు సాధించాడని గుర్తుచేశారు. “కరుణ్ నాయర్ దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి టోర్నీల్లో ఆడలేదు. కానీ అతనికి అవకాశం ఇచ్చారు. మంచిదే, కానీ అదే సమయంలో అభిమన్యు చేసిన కృషి గుర్తించబడలేదు” అని వ్యాఖ్యానించారు.
అలాగే, ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్ట్ జట్టులో ఆటగాళ్లను ఎంపిక చేయడం సరైంది కాదని విమర్శించారు. “టెస్ట్ జట్టు ఎంపికలో రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ప్రదర్శనలే ప్రాతిపదిక కావాలి” అని స్పష్టం చేశారు.
దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకు 103 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 48.70 సగటుతో 7,841 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Read More : ఓవల్ టెస్టులో తొలి రోజు భారత్ 204/6

One thought on “సెలెక్టర్లపై అభిమన్యు ఈశ్వరన్ తండ్రి ఆగ్రహం”
Comments are closed.