తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు – ‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా మహిళలకు కొత్త అవకాశాలు

ponnam prabhakar

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 2.5% డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించిన అనంతరం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీఏ పెంపుతో ఆర్టీసీపై నెలకు రూ.3.6 కోట్ల భారం పడనుంది.

మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ భారీగా పెరిగింది. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని మంత్రి వెల్లడించారు. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగినా వారు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు.

‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా మహిళలకు కొత్త అవకాశాలు

మహిళా ఆర్థిక సాధికారతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా 600 బస్సులను మహిళా సమైక్య సంఘాలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి దశలో 150 బస్సులను రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ప్రారంభించనున్నారు.

ఈ పథకం అమలుకు పాత ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండల మహిళా సమైక్యల ద్వారా కొనుగోలు చేసిన బస్సులు ఆర్టీసీకి అద్దెకు ఇస్తారు. దీని ద్వారా ప్రయాణికుల డిమాండ్‌ను తీరుస్తూనే, మహిళలకు స్థిర ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం

ఇంతవరకు ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మహిళా సంఘాల చేతనే ఆర్టీసీ బస్సులను నడిపించే ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయంగా అభివర్ణిస్తోంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. ఈ పథకం మహిళా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు, మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబనను అందించనుంది.

Read More

One thought on “తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు – ‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా మహిళలకు కొత్త అవకాశాలు

Comments are closed.