వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం

AP Politics

ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టుల ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. వైసీపీ హయాంలో AP FDC ఛైర్మన్‌గా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందని వైసీపీ ఆరోపిస్తే, నేరం చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనంటూ మంత్రులు గట్టిగా స్పందించారు.

Posani Krishna Murali Arrest: వైసీపీ నేతల తీవ్ర వ్యతిరేకత

పోలీసులు ఈ అరెస్టులో అనూహ్య మలుపు తీసుకువచ్చారు. వల్లభనేని వంశీ తర్వాత కృష్ణా జిల్లాకి చెందిన ఇద్దరు నేతల్లో ఒకరిని అరెస్ట్ చేస్తారని టీడీపీ వర్గాలు ఊహించగా, అనూహ్యంగా పోసాని కృష్ణ మురళినే అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేయడంతో ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద పోసాని పై కేసులు పెట్టారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సినీ రంగంతో పాటు కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడారని FIR లో పేర్కొన్నారు.

బుధవారం రాత్రి హైదరాబాద్ లో నాటకీయ పరిణామాల మధ్య పోసాని ను అరెస్ట్ చేసి, ఓబులవారిపల్లి పోలీస్‌ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

పోసాని అరెస్టుపై వైఎస్ జగన్ కౌంటర్

ఈ అరెస్ట్ వెనుక రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పోసాని అరెస్ట్ పై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటూ స్పందించిన జగన్, పోసాని భార్యను ఫోన్ చేసి పరామర్శించారు. పోసాని కుటుంబానికి వైసీపీ పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మంత్రుల స్పందన

మరోవైపు, వైసీపీ హయాంలో చట్టాన్ని తేలిగ్గా తీసుకున్న వాళ్లు ఇప్పుడు తప్పించుకోలేరు అని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయన్నారు. పోసాని అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం కింద జరుగలేదని, అదో చట్టపరమైన చర్య మాత్రమేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందే అని తేల్చిచెప్పారు.

Read More