ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథం – హైకోర్టు స్పష్టీకరణ
ఫిబ్రవరి 23న జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల వాయిదాకు హైకోర్టు తిరస్కారం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష కొనసాగకపోతే అర్హత సాధించిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అర్హత పొందగా, కేవలం ఇద్దరి అభ్యంతరాల కోసం పరీక్షను నిలిపివేయలేమని తేల్చిచెప్పింది.
ఈ కేసులో ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు నియామక ప్రక్రియ కోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతుందని పేర్కొంది. 10 రోజుల్లోగా ప్రభుత్వాన్ని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.
దీంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం పేపర్ 1 పరీక్ష 10:00 AM నుండి 12:30 PM వరకు, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష 3:00 PM నుండి 5:30 PM వరకు జరుగుతుంది. అభ్యర్థులు నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చినవారికి ప్రవేశం ఉండదని అధికారులు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు తెలిపారు.
