సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు లేవని నగర అదనపు సీపీ (ట్రాఫిక్) విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు పలు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు సీపీ తెలిపారు.
తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలపై వస్తున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో వచ్చే సమాచారాన్ని సరైనదో కాదో నిర్ధారించుకోకుండా వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా వేదికలలో పంచడం నేరమని హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే లేదా నిజ నిర్ధారణ చేసుకోవాలనుకుంటే, ప్రజలు తెలంగాణ పోలీసు శాఖ అధికారిక వెబ్సైట్ https://echallan.tspolice.gov.in/publicview/ను చూడాలని లేదా 040-27852772, 27852721 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
