Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై సీఎం తీవ్ర స్పందన

Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి స్పందించిన సీఎం

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిపై ఓయూ జేఏసీ (OU JAC Attacks) నేతల దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘‘సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

సంఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా స్పందించారు. ‘‘హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. పౌరులకు రక్షణ కల్పించడంలో పరిపాలన అసమర్థతను ఇలాంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది’’ అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.