తెలంగాణలో భారీ వర్షాలు, రహదారులు జలమయం

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, పట్టణాల జీవన విధానాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా, కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇక సిద్దిపేట జిల్లాలోని గౌరారం గ్రామంలో నిన్న రికార్డు స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలో ములుగులో 18.65 సెంటీమీటర్లు, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.95 సెంటీమీటర్లు, కామారెడ్డిలోని పిట్లంలో 17.5 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో 16.48 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. అలాగే యాదాద్రి భువనగిరి 16.4, కామారెడ్డి 16, నిజామాబాద్ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్‌లో కూడా వర్షాలు విరుచుకుపడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో నీరు చేరింది. అత్యధికంగా హైదర్‌నగర్‌లో 4.5 సెంటీమీటర్లు, మల్కాజిగిరి 4.4, కూకట్‌పల్లి 4.3, కాప్రా, శేర్లింగంపల్లి 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్, అల్వాల్, బీహెచ్ఈఎల్, రామచంద్రపురంలో 4 సెంటీమీటర్లు, నేరేడ్‌మెట్, ఉప్పల్, మల్లాపూర్, గాజులరామారం, మౌలాలి, ముషీరాబాద్, సఫిల్‌గూడ్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.

వర్షాల కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అధికారులు అప్రమత్తంగా చర్యలు చేపడుతున్నారు.

Read More : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం రద్దు