ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను తమ తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలబెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా, 1998-2004 మధ్య లోక్‌సభ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఈ ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకు స్పష్టమైన సంఖ్యాబలం ఉంది. సుమారు 422 మంది సభ్యులు మద్దతు ఇవ్వనున్నందున రాధాకృష్ణన్ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 21 నామినేషన్ల దాఖలు చివరి తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 25 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. సెప్టెంబర్ 9న రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది.

ఇదిలా ఉండగా, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కూడా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీఏకు ఉన్న బలమైన సంఖ్యాబలం దృష్ట్యా ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు చాలా కష్టమని భావిస్తున్నారు.

Read More : అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం

One thought on “ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్

Comments are closed.