ఏపీ పోలీస్ శాఖకు శుభవార్తను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మరో నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయని ఆమె తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పోలీస్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తూ, ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ కోసం రూ.2.5 కోట్లు సీఎస్ఆర్ నిధులు కేటాయించిన హెటిరో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
పోలీస్ శాఖలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించి ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం కృషితో లా అండ్ ఆర్డర్ పరంగా రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచిందని గర్వంగా తెలిపారు. ఇప్పటి వరకు 60 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో లక్ష కెమెరాలను అమర్చే లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. బస్టాండ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాలు, ముఖ్య కూడళ్లలో వీటిని అమర్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానిస్తున్నట్లు వివరించారు. వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ, గత ఐదేళ్లలో పోలీస్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు. “మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర వైఫల్యం కనిపించింది. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయి” అని ఆమె స్పష్టం చేశారు.
Read More : తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుత చిక్కింది

One thought on “ఏపీ పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు”
Comments are closed.