మోదీ-ట్రంప్ సంబంధాలపై నెతన్యాహు సలహాలు

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో సలహాలు ఇవ్వగలనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ట్రంప్ ఇద్దరూ తనకు అత్యంత సన్నిహితులని తెలిపుతూ, ఈ విషయంపై వ్యక్తిగతంగా సూచనలు ఇవ్వాలని సూచించారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత జర్నలిస్టులతో మాట్లాడుతూ నెతన్యాహు “ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. ట్రంప్‌తో సంబంధాల విషయంలో మోదీకి కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నా, అవి బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగా చెప్పనని” పేర్కొన్నారు. అలాగే త్వరలోనే భారత్‌లో పర్యటించేందుకు తన ఆత్రుతను కూడా వెల్లడించారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న భారీ సుంకాల నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధించిన పరిస్థితిలో, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ వాణిజ్య వివాదంపై నెతన్యాహు, భారత్-అమెరికా మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, సుంకాల సమస్యను కలిసి పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరిష్కారం ఇజ్రాయెల్‌కు కూడా ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి మద్దతు అందిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ కూటమి గా పనిచేయనున్నట్లు చెప్పారు. గురువారం ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌తో నెతన్యాహు ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలుస్తోంది.

Read More : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనా పర్యటనకు