పాకిస్థాన్‌కు చెందిన ప్రసిద్ధ నటి హుమైరా అస్గర్ అలీ మరణ వార్త చలించిపోతోంది. మంగళవారం ఆమె కరాచీలోని తన నివాసంలో విగతజీవిగా గుర్తించబడింది. అయితే ఆమె మృతదేహం దాదాపు తొమ్మిది నెలల క్రితమే మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరిసారి ఫోన్ కాల్ గతేడాది అక్టోబర్‌లో నమోదైంది. అప్పటి నుంచి ఆమె ఎవరికీ కనిపించలేదు. పొరుగువారు కూడా ఆమెను చివరిసారి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే చూశారని చెప్పారు. అదే సమయంలో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు ఆమె అపార్ట్‌మెంట్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పోస్ట్‌మార్టం చేసిన కరాచీ పోలీస్ సర్జన్ డాక్టర్ సుమయా సయ్యద్ మాట్లాడుతూ.. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో, దాదాపు తొమ్మిది నెలల కిందటే ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఇంట్లో ఉన్న ఆహారం పాడైపోయిన స్థితిలో ఉండగా, బాటిళ్లు తుప్పుపట్టినట్టు మరో అధికారి చెప్పారు.
ఫిబ్రవరిలో అపార్ట్‌మెంట్‌కు వాసన రావడం తగ్గడంతో ఇతర నివాసితులు గమనించలేకపోయారు. చివరకు హుమైరా అద్దె చెల్లించకపోవడంతో అపార్ట్మెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కుటుంబసభ్యులు తొలుత మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించగా, చివరకు సోదరుడు నవీద్ అస్గర్ కరాచీకి వచ్చి తీసుకెళ్లారు. నవీద్ తెలిపిన ప్రకారం, హుమైరా ఏడేళ్ల క్రితం లాహోర్ నుంచి కరాచీకి వెళ్లిందని, ఇంటికి చాలా కాలంగా వెళ్లకపోయిందని తెలిపారు. హుమైరా సినీ ప్రస్థానం 2015లో ప్రారంభమైంది. ‘జస్ట్ మ్యారీడ్’, ‘ఎహసాన్ ఫరమోష్’, ‘గురు’, ‘చల్ దిల్ మేరే’ వంటి టీవీ షోలలో నటించిన ఆమె, 2022లో ప్రసారం అయిన రియాలిటీ షో ‘తమాషా ఘర్’ ద్వారా మంచి గుర్తింపు పొందింది. 2023లో ఆమెకు ‘బెస్ట్ ఎమర్జింగ్ ట్యాలెంట్ అండ్ రైజింగ్ స్టార్’ అవార్డు కూడా లభించింది. ఈ విషాద ఘటన పాక్ సినీ పరిశ్రమలో తీవ్ర ఆవేదన కలిగించింది. హుమైరా మృతి వెనక కారణాలు, వ్యక్తిగత పరిస్థితులపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read More : మలేషియాలో పోలీసు హెలికాప్టర్ ప్రమాదం

2 thoughts on “పాకిస్థాన్ టీవీ నటి హుమైరా అస్గర్ అకాల మరణం…”
Comments are closed.