బంగ్లాదేశ్‌లో ‘సర్’ సంబోధనపై కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌లో మహిళా అధికారులను “సర్” అని సంబోధించాలన్న వివాదాస్పద ఆదేశాలపై మధ్యంతర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న (గురువారం) జరిగిన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ ఆదేశాలను అధికారికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వ కాలంలో ఆమెను, తద్వారా మహిళా అధికారులను కూడా “సర్” అని పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది ఏకంగా 16 ఏళ్ల పాలనలో అమలులో ఉండింది. ఇప్పటికీ అక్కడ కొంతమంది మహిళా అధికారులను అదే విధంగా సంబోధిస్తుండటం గమనార్హం. ఇలాంటి సంబోధన సామాజికంగా, పరిపాలనా పరంగా అనుచితమని పలువురు సభ్యులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇకపై మహిళా అధికారులకు లైంగిక సమానత్వాన్ని కించపరచే విధంగా “సర్” అనే పదాన్ని వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతేకాదు, అధికారులను ఎలా సంబోధించాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి సైదా రిజ్వానా హసన్ నేతృత్వంలో రివ్యూ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదికను సమర్పించాలని సూచించారు. అలాగే, ఇతర శాసన, పరిపాలనా ప్రోటోకాల్స్‌పై కూడా సమీక్ష జరిపి, అవసరమైన మార్పులను సూచించనున్నారు. ఈ నిర్ణయం మహిళా హక్కులకు మద్దతుగా నిలుస్తుందని, పరిపాలనా వ్యవస్థలో సానుకూల మార్పుకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More : పాకిస్థాన్ టీవీ నటి హుమైరా అస్గర్ అకాల మరణం…