ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మహిళల గౌరవంపై దాడిగా భావించదగిన ఘటన తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో సభ్యసమాజం సిగ్గుపడుతోందని, మహిళల గౌరవాన్ని కించపరిచే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే శాసనసభ వేదికపైనూ వైసీపీ నేతలు దురుసుగా మాట్లాడారని, అలాంటి నాయకులకు ప్రజలు తగిన సమాధానాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
ఇక ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘వైసీపీ నేతలకు మహిళలంటే అంత ద్వేషమా?’’ అంటూ ప్రశ్నించారు. ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని అవహేళన చేయడం నేరం, దారుణమని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటూ మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడమేనా వైసీపీ సంస్కృతి? అంటూ ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ ఉండదన్న వాస్తవం ప్రజలందరికి తెలిసిపోయిందని, ఇది ప్రజాస్వామ్య రాజ్యం, జంగిల్ రాజ్ కాదని స్పష్టం చేశారు. మహిళలపై ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర ప్రభావం పడే అవకాశముండగా, మహిళా సంఘాలు, పౌరసంఘాలు కూడా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి.
Read More : హైదరాబాద్ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం

One thought on “వైసీపీ నేత ప్రసన్నపై పవన్, లోకేశ్ ఆగ్రహం”
Comments are closed.