ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్రయోజనం జిల్లాలోపల ప్రయాణించే మహిళలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంటే, ఓ జిల్లాకు చెందిన మహిళ ఆ జిల్లాలోనే ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వం దృష్టి సారించే రెండు కీలక అంశాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలతో పోలిస్తే తమ పాలనలో స్పష్టమైన తేడా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇదే సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్‌ను భారీగా పెంచామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో వెయ్యి రూపాయల పెంపు చేసినప్పుడు, తాము ఒకేసారి అంత మొత్తాన్ని పెంచామని వివరించారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గొప్ప వరమని, రాయలసీమ అభివృద్ధికి తమ వద్ద పూర్తిస్థాయి బ్లూప్రింట్ సిద్ధంగా ఉందన్నారు. గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలిస్తే రాయలసీమలో కరువు అనే సమస్య మిగలదని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రకటనలతో మహిళలకు, రాయలసీమ ప్రజలకు చంద్రబాబు సంక్షేమ సంకేతాలే అందించినట్లు ప్రజలు భావిస్తున్నారు.
Read More : వైసీపీ నేత ప్రసన్నపై పవన్, లోకేశ్ ఆగ్రహం

One thought on “ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం”
Comments are closed.