చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గుడికి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదనే కారణంతో, శివశంకర్ అనే వ్యక్తి మృతి అనంతరం ఆయన అంత్యక్రియలకు గ్రామస్తులు బహిష్కారం విధించడం కలకలం రేపింది.
గ్రామానికి చెందిన తిమ్మరాయ స్వామి ఆలయానికి రహదారి అవసరమై, గ్రామ పెద్దలు శివశంకర్‌ను స్థలం ఇవ్వమని కోరినప్పటికీ, ఆయన అంగీకరించలేదు. దీంతో గ్రామస్తులతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.
అయితే, ఆలయ రహదారి కోసం స్థలం ఇవ్వలేదనే ఆవేశంతో, గ్రామ పెద్దలు శివశంకర్ అంత్యక్రియలకు ఎవరూ హాజరుకావద్దని సూచించడమే కాక, స్మశానంలో మృతదేహాన్ని పూడ్చకుండా అడ్డుకున్నారు. దీంతో శివశంకర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఇది పెద్ద కలహంగా మారడంతో పోలీసులు చేరుకుని పరిస్థితిని సమర్థవంతంగా శాంతింపజేసి, సెక్యూరిటీ మధ్యలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మానవత్వం మరిచిపోయిన ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Read More : డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన నారా లోకేశ్
